సరిగ్గా పార్లమెంట్ సమావేశాల ముందు ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరిరువురూ చర్చించుకున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్ చేసింది. ‘‘ఎన్సీపీ అధినేత పవార్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు’’ అని ట్వీట్ చేసింది. రాష్ట్రపతి రేసులో ముందున్నారంటూ పవార్ పేరు తెరపైకి రావడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే మోదీతో పవార్ ఎందుకు భేటీ అయ్యారన్న విషయంపై ఎన్సీపీ అధికార ప్రతినిధి, మంత్రి నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన సహకార మంత్రిత్వ శాఖ గురించి వీరు చర్చించుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రైతుల సమస్యలపైనా పవార్ మోదీతో చర్చించారు. సహకార బ్యాంకుల రంగం రాష్ట్రాలకు సంబంధించిన జాబితాలో ఉందని, కేంద్రం జోక్యం చేసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని పవార్ మోదీతో అన్నట్లు తెలుస్తోంది.