లక్షలు ఖర్చుపెట్టి పైచదువులకు విదేశాలకు వెళ్లిన భారతీయులకు అక్కడి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అక్కడి ఖర్చులకు సరిపడా ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాలు దొరక్క చివరకు ఇండియాకు వచ్చేస్తున్నారు. అయితే, భవిష్యత్తులో పరిస్థితులు మెరుగవుతాయని అక్కడ సెటిలైన ఎన్నారైలు చెబుతున్నారు. సహనంతో మంచి ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అమెరికా, కెనడాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని కొందరు భారతీయ విద్యార్థులు చెబుతున్నారు. ఆరు నెలల పాటు కెనడాలో చదువుకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై చివరకు ఓ సూపర్ మార్కెట్లో జాబ్ చేస్తున్నానని ఓ విద్యార్థి దీనంగా చెప్పాడు. కెనడాలో నెలవారీ ఖర్చులు మొత్తం మూడు వెల డాలర్ల వరకూ ఉంటుంది, ఇందుకు సరిపడా ఆదాయమార్గం కనబడక అనేక మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
విదేశాల్లో ఉండటం కంటే స్వదేశంలోనే ఏదోక ఉపాధి మార్గం వెతుక్కోవడమే మేలని కూడా కొందరు భావిస్తున్నారు. అంతేకాదు, లక్షలు పోసి పొందిన విదేశీ యూనివర్సిటీ డిగ్రీలతో కొందరు ఇండియాకు తిరిగొచ్చేస్తున్నారు కూడా. అయితే, కఠిన పరిస్థితులను కాస్త ఓపిగ్గా ఎదుర్కోగలిగితే డాలర్ కలను నిజం చేసుకోవచ్చని అక్కడ కొన్నేళ్లుగా ఉంటున్న ఎన్నారైలు చెబుతున్నారు. ప్రస్తుతం విదేశీ గడ్డ భారతీయులకు ఒడిదుడుకుల మయంగా కనిపిస్తున్నప్పటికీ భవిష్యత్తు కచ్చితంగా పరిస్థితులు మెరుగవుతాయని అంటున్నారు.