ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశమైన ఈఫిల్ టవర్ లో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈఫిల్ టవర్ మూడు అంతస్తుల్లో ఉన్న సందర్శకులను ఫ్రాన్స్ పోలీసులు ఖాళీ చేయించారు. టవర్ పైన ఉన్న రెస్టారెంట్‌లోని వారిని కూడా అక్కడి నుంచి పంపేశారు. అనంతరం బాంబు స్క్వాడ్, పోలీసులు కలిసి ఈఫిల్ టవర్ అంతటా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి సందర్శకులను అనుమతించలేదు. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ నిర్మాణ పనులు 1887లో ప్రారంభమయ్యాయి. 1889 మార్చి 31న దీని నిర్మాణం పూర్తయ్యింది. ఆ ఏడాదిలో ఫ్రాన్స్‌లో జరిగిన వరల్డ్ ఫెయిర్ సందర్భంగా ఈఫిల్ టవర్‌ను సుమారు 20 లక్షల మంది సందర్శించారు. గత ఏడాది 62 లక్షల మంది దీనిని చూసేందుకు అక్కడకు వెళ్లారు.