హిందూ విశ్వాసమే జీవితంలోని ప్రతి అంశంలో తనకు మార్గదర్శకం చేస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని బ్రిటన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లోని జీసస్ కళాశాలలో ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ కథ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉందన్నారు. ఇక్కడికి నేను ప్రధానిగా రాలేదు. ఒక హిందువుగా వచ్చాను. విశ్వాసం అనేది నా దృష్టిలో వ్యక్తిగతం. ఇది నా జీవితంలోని ప్రతి అంశంలో నాకు మార్గదర్శకం చేస్తుంది. ప్రధాని పదవి అనేది గొప్ప గౌరవం. కానీ, అది అంత తేలికైన పని కాదు. చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది అని అన్నారు.














