మలేసియా వచ్చే భారత ప్రయాణికులకు కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ కీలక సూచన చేసింది. మలేసియా అందిస్తున్న 30 రోజుల వీసా ఫ్రీ ట్రావెల్‌ను దుర్వినియోగం చేయొద్దని సూచించింది. దాన్ని ఉపాధి అవకాశాల కోసం వినియోగించొద్దని పేర్కొన్నది. నకిలీ జాబ్ ఆఫర్లతో మలేసియాకు వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు అడ్వైజరీ జారీచేసింది.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారని, వారి చేతిలో చాలామంది మోసపోతున్నారని హైకమిషన్ తన అడ్వైజరీలో పేర్కొన్నది. పర్యాటక లేదా వీసా ఫ్రీ ట్రావెల్‌పై వచ్చి ఇక్కడ గడువుకు మించి ఉండిపోతున్నారని, దాంతో చట్టపరంగా చర్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. భారత పాస్‌పోర్ట్ కలిగిన వారికి ఇస్తున్న 30 రోజుల వీసా రహిత ప్రవేశం కేవలం పర్యాటకం, సామాజిక సందర్శన కోసం ఉద్దేశించినది మాత్రమేనని భారత హైకమిషన్ తెలిపింది. దీన్ని ఉపాధి అవసరాల కోసం వినియోగించడం మలేసియా వలస నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నది. కాబట్టి వర్క్ పర్మిట్ లేకుండా మలేసియాకు రావొద్దని సూచించింది.















