గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రెసిడెన్సీ, వర్క్ పర్మిట్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇక ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వెంటనే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఇలా గత రెండేళ్ల నుంచి భారీ మొత్తంలో ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు ఆశ్రయమిచ్చే వారితో పాటు నివాస అనుమతి చట్టాలను ఉల్లంఘించిన వారందరినీ దేశం నుంచి బహిష్కరించేందుకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల కోసం నిర్బంధ కేంద్రాలుగా జలీబ్ అల్ షుయౌఖ్, ఖైతాన్లలో ప్రస్తుతం వినియోగించని రెండు స్కూళ్లలను మంత్రిత్వశాఖ ఉపయోగించాలని నిర్ణయించింది. రానున్న రోజుల్లో భద్రతా తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.
