ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపధ్యంలో కెనడియన్లకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ఆరోపించిన అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిర్వహణ పరమైన కారణాలతో సెప్టెంబర్ 21 నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిచిపోయాయని కెనడియన్ల వీసా దరఖాస్తులను పరిశీలించేందుకు నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ బీఎల్ఎస్ తన వెబ్సైట్లో పేర్కొంది. కాగా, కెనడియన్ల వీసా సేవల నిలిపివేతను భారత్ అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
