పాకిస్థాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో దేశాన్ని ఆర్థికంగా గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఖజానా పై భారం పడకుండా ఇప్పటికే అధ్యక్షుడు సహా ప్రధాని, కేబినెట్ మంత్రులు తమ జీతాలు, ఇతర ప్రోత్సహాల ను వదులుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా రెడ్ కార్పెట్ వినియోగాన్ని కూడా నిషేధిస్తూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. దుబారా ఖర్చులు లేకుండా పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో రెడ్ కార్పెట్ ల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ మినిస్టర్స్, సీనియర్ అధికారులు రెడ్ కార్పెట్ వినియోగించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం కేవలం దౌత్యపరమైన కార్యక్రమాలకు మాత్రమే వీటిని వినియోగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.