అమెరికాలో జరిగే జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో మళ్లీ భారతీయ సంతతి విద్యార్థి సత్తా చాటారు. తెలంగాణకు చెందిన భారతీయ అమెరికన్ బాలుడు బృహత్ సోమ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ-2024 పోటీల్లో విజేతగా నిలిచాడు. ట్రైబేకర్‌లో అత్యధికంగా 29 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పి ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో సరికొత్త రికార్డుతో చరిత్ర సృష్టించాడు. గురువారం జరిగిన ఈ పోటీలో విజేతగా నిలిచిన ఈ ఇండియన్ అమెరికన్ 50 వేల డాలర్ల నగదు బహుమతితో పాటు మరికొన్ని కానుకలు సొంతం చేసుకొన్నాడు. 90 సెకన్ల వ్యవధిలో మొత్తం 30 పదాలకు గాను 29 పదాలకు బృహత్ తడబడకుండా సరైన స్పెల్లింగ్ చెప్పాడు. ఫ్లోరిడాలో ఏడో గ్రేడ్ చదువుతున్న బృహత్ సోమ తండ్రి శ్రీనివాస్ సోమ తెలంగాణ లోని నల్గొండకు చెందినవారు. మూడో ప్రయత్నంలో బృహత్ సోమ ఈ టైటిల్ గెలిచాడు. 2022లో ప్రవాస భారతీయ బాలిక హరిణి లొగన్ 26 పదాల్లో 22 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పడమే మొన్నటి వరకు రికార్డుగా నిలిచింది.