ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్……. – భర్తృహరి ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు అని దీనర్థం.
పాపులర్ సైక్లిస్ట్ రంజిత్ ఈ మాటలు నెమరు వేసుకున్నాడు, రంజిత్ వరంగల్ నుండి తన సైకిల్ జర్నీ ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా చుట్టి రావాలన్న కోరికలో భాగంగా సిడ్నీ చేరుకుని పారమట్టా పార్క్ లో ATSA నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో తన అనుభవాలను పంచుకోవడం జరిగింది.
రంజిత్ తండ్రి మరణం, మనుషుల ఆరోగ్యం విలువ ప్రపంచానికి తెలియచేయాలన్న తపన రేకెత్తించింది. అలాగే దేశ వ్యాప్తంగా వాహనాల వల్ల ఉత్పన్నమవుతున్న కాలుష్యాన్ని చూసి చలించి, ఈ కాలుష్యానికి ఒక నివారణా మార్గంగా సైకిల్ వాడకం ఒక మంచి ఆలోచన అనే తలంపు తో ప్రపంచాన్ని చుట్టేసి రావాలని – ‘పొల్యూషన్ కి సొల్యూషన్ ‘ అనే నినాదం తో వందల మందిని ప్రేరేపించాలని తన లక్ష్యం గా బయల్దేరాడు రంజిత్.
ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసోషషన్
(ATSA) రంజిత్ ని తన అనుభవాలను పంచుకోవాలని కోరడంతో , రంజిత్ తన నిర్ణయానికి వెనక ఉన్న ఆలోచనలను , తన దారిలో ఎదురైన కష్టాలను , వివిధ దేశాలలో జరిగిన సంఘటనలను , పలు రకాల మనుషులతో తన అనుభవాలను అక్కడికి విచ్చేసిన చాలా మందితో పంచుకున్నాడు రంజిత్ .దానిలో భాగంగా , ఈ యాత్ర మొదలు పెట్టడానికి ముందు తనని నిరుత్సాహ పరిచిన వాళ్ళ గురించి చెప్పే క్రమంలో రంజిత్ తాను మొదలు పెట్టిన సంకల్పాన్ని పూర్తి చేసే వరకు ఎలా తనని తాను ఎప్పటికప్పుడు ఎలా ప్రేరేపించుకున్నాడో వివరించడం అందరిని తీక్షణంగా వినేలా చేసింది . ఎప్పుడు డీలా పడినా తనని తాను సంసిద్ధం చేసుకోడానికి పైన చెప్పిన భర్తృహరి పద్యం ఎలా ఉపయోగపడిందో వివరించడం అక్కడున్న వారందరినీ కదిలించింది. రంజిత్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. రంజిత్ సైకిల్ యాత్రకు తమ వంతుగా 2000 డాలర్లు అందజేశారు.