అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్‌కు భారీ ఊరట కల్పించారు. రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్‌కు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. తండ్రిగా, అధ్యక్షుడి గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు.
అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్, కాలిఫోర్నియాలో హంటర్‌పై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే, ఇప్పటి వరకూ శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్ స్పందిస్తూ హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు యత్నించబో నని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమా భిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. బైడెన్ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.