అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాగా తెలుగింటికి చెందిన అల్లుడు జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియన్ ఫ్యామిలీ తో ఉన్న ఓ గ్రూప్ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తన భార్య తరఫు బంధువులతో, భుజాలపై కొడుకును కూర్చో బెట్టుకుని వాన్స్ నిలబడ్డారు.
గతవారం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. కాగా, జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1980లో అమెరికాకు వలస వెళ్లారు. వీరి ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు.