హెచ్-1బీ వీసా విధానం విఫలమైందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అభివర్ణించారు. ఇందులో భారీ సంస్కరణలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో విదేశీ నైపుణ్య కార్మికులు పనిచేసేందుకు అనుమతించే ఈ విధానాన్ని రక్షించేందుకు యుద్ధానికి సైతం సిద్ధమని ప్రకటించిన కొన్ని రోజులకే ఎలాన్ మస్క్ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వచ్చే జనవరిలో ఏర్పడనున్న ట్రంప్ ప్రభుత్వంలో భాగస్వాములు కాను న్న ఎలాన్ మస్క్, భారతీయ-అమెరికన్ టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని ఇదివరకే బలపరిచారు. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ మద్దతుదారులతో కూడా వారు ఇటీవల ఘర్షణపడ్డారు. తాను యజమానిగా ఉన్న సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వచ్చిన ఒకపోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు.
దక్షిణాఫ్రికా నుంచి హెచ్-1బీ వీసాపై వలస వచ్చిన ఎలాన్ మస్క్, హెచ్-1బీ వీసా విధానం విఫలమైందని, దీనికి భారీ సంస్కరణలు అవసరమని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రపంచానికి చెందిన అత్యున్నత నైపుణ్యానికి అమెరికా గమ్యస్థానం కావాలని, అయితే హెచ్-1బీ వీసాతో ఆ పని జరగదని ఓ ఎక్స్ యూజర్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ ఈ విధంగా స్పందించారు. విఫలమైన విధానాన్ని ఎలా సరిచేయవచ్చో కూడా మస్క్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వీసా రావడానికి అవసరమైన కనిష్ఠ వేతనాన్ని గణనీయంగా పెంచాల్సి ఉంటుందని, దీని వల్ల దేశీయంగా లభించే ఉద్యోగుల కన్నా విదేశీ ఉద్యోగులను తీసుకోవడం చాలా ఖరీదుగా మారుతుందని మస్క్ పేర్కొన్నారు.