అగ్ర హీరో రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవలే పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపాయికి జన్మనిచ్చారు. ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఏ తండ్రికైనా తన బిడ్డను తొలిసారి తాకగానే ఎలాంటి అనుభూతి, ఆనందం కలుగుతాయో నాకు అలాగే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం అయ్యింది. ఓ తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముంది. ఈ సంతోషంలో మాటలు రావడం లేదు. అపోలో వైద్య బృందం తల్లీబిడ్డలను బాగా చూసుకున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు.

ప్రస్తుతం ఉపాసన, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మా అభిమానులు చేసిన ప్రార్థనలు, పూజల గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. అభిమానుల ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు చూపించిన ప్రేమను మరచిపోలేను. నా జీవితంలో ఇవి మధురక్షణాలు. పాపకు ఇప్పటికే ఓ పేరు అనుకున్నాం. 21వ రోజున పేరు పెట్టబోతున్నాం. అదే రోజున అందరికి తెలియజేస్తాను అన్నారు.

