Namaste NRI

డల్లాస్‌లో తానా ఆధ్వర్యంలో వేడుకగా స్వరరాగావధానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహించిన గరికపాటి వేంకట ప్రభాకర్ స్వరరాగావధానం కార్యక్రమం డాలస్ నగరం దగ్గరలోని లూయిస్ విల్‌లో ఉన్న కాకతీయ లగ్జరీ బాంక్వెట్ హాల్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణకు తానా ప్రతినిధులు పరమేశ్ దేవినేని, రాజేశ్ అడుసుమిల్లి నాయకత్వం వహించగా, మద్దుకూరి చంద్రహాస్ సంధానకర్తగా వ్యవహరించారు. ముందుగా తానా సంస్థ తరఫున రాజేష్ ఆడుసుమిల్లి సభికులకు స్వాగతం పలికి, గరికపాటి ప్రభాకర్ తనకూ వున్న గురుశిష్య సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సంధానకర్త మద్దుకూరి చంద్రహాస్ స్వరరాగవధానం గురించి సభకు పరిచయం చేస్తూ, సంగీతసాహిత్య సమలంకృతంగా రాగాలతో తాళాలతో ప్రదర్శించబడే అపూర్వ చారిత్రాత్మక కార్యక్రమం స్వరరాగావధానం అని, ఇందులో స్ఫురణ ప్రేరణ ప్రధానమైనవని వివరించారు. అవధాని గానవిద్యాప్రవీణ స్వరశుభకర గరికపాటి వేంకట ప్రభాకర్ శాస్త్రీయ సంగీతం సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా జనరంజంకంగా సమాజానికి అందించటమే తన లక్ష్యంగా చెప్పారు.

రాగమార్పు, రసమార్పు, తాళమార్పు, రాగమాలిక, నిషిద్ధస్వరం, స్వరాక్షరి, భావవర్ణన అనే అంశాల మీద వరుసగా చంద్రహాస్ మద్దుకూరి, ప్రభాకర్ కోట, రామకృష్ణ నేతి, జయ పండ్రంగి, విశాల అవధానం, సవిత నముడూరి, అనంత్ మల్లవరపు పృచ్ఛకులుగా అవధాని పై ప్రశ్నల వర్షం కురిపించారు. సమయస్ఫూర్తితో, సృజనాత్మకతతో, ప్రతిభావ్యుత్పత్తులతో, అప్పటికప్పుడు స్వరరచన చేస్తూ, రాగతాళరసాదులను మారుస్తూ, సామాన్యులకు కూడా అరటిపండు వలచి పెట్టినట్టు సంగీతరహస్యాలను వివరిస్తూ అవధాని గరికపాటి వేంకట ప్రభాకర్ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. భాస్కర్ రాయవరం అప్రస్తుత ప్రసంగం అలరించింది.

డాక్టర్ ప్రసాద్ తోటకూర, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిథులుగా ప్రసంగించి నిర్వాహకులను, అవధానిని ప్రశంసించారు. తానా నిర్వాహకవర్గం అవధానిని సన్మానించడంతో కార్యక్రమం ముగిసింది. మాడ దయాకర్ నిర్వహణలో డాక్టర్ ఖ. నరసింహారెడ్డి, లెనిన్ వేముల పాల్గొన్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారి నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం కూడా ఈ స్వరరాగావధానంతో అనుసంధానంగా జరిపారు.

ఈ కార్యక్రమంలో తానా కార్యవర్గం సభ్యులు మల్లి వేమన, సతీశ్ కొమ్మన, సతీశ్ కోటపాటి, మురళి వెన్నం, సుధీర్ చింతమనేని, వీర్నపు చినసత్యం మరియు టాంటెక్స్ కార్యవర్గం సభ్యులు చంద్రా పొట్టిపాటి, నరసింహ పోపూరి, కొండా తిరుమలరెడ్డి, సురేష్ మండువ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News