అమర్‌దీప్, అశ్విని రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా అభిలాష. ఈ సినిమాను శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ పతాకంపై సీహెచ్. శిరీష నిర్మించారు. శివప్రసాద్ చలువాది దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ హాస్య నటుడు పృథ్వి విడుదల చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు లేవు. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. ట్రైలర్ చాలా బావుంది. ఓ మంచి పాయింట్‌తో ఈ సినిమాను తీయడం సంతోషం. చిత్ర బృదం కష్టానికి తగిన మంచి ఫలితం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శివప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను చెప్పే చిత్రమిది. మనతో పాటు సమాజ చైతన్యానికి, అభివృద్ధికి విద్య ఎంతగా ఉపయోగపడుతుందో ఈ కథలో చూపిస్తున్నాం.ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా నవరసాల భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించాం అన్నారు.

నిర్మాత సీహెచ్. శిరీష మాట్లాడుతూ చదువు వద్దని చెప్పే ప్రతినాయకుడితో హీరో ఎలాంటి పోరాటం చేశాడు అనేది చిత్ర కథ. ప్రతి పాత్రకు తగిన నటీనటులు దొరికారు. త్వరలోనే మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్, సమ్మెట గాంధీ, అశోక్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సౌమ్య శర్మ, సంగీతం : ఎం.ఎం.కుమార్. ఈ కార్యక్రమంలో నటీనటులు బెల్లంకొండ వెంకట్, ఐడ్రీం అంజలి, జబర్దస్త్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కుమార్, ఫైట్ మాస్టర్ నభా, గీత రచయిత తిరుపతి, స్క్రీన్ ప్లే రచయిత పాండు చరణ్, ఇంకా సహనిర్మాత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
