ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త చీఫ్‌గా ఐఐటీ మద్రాస్‌కు చెందిన పవన్ దావులూరి నియామకమయ్యారు. గతంలో ఈ భాగానికి నేతృత్వంలో వహించిన పనోస్ పనయ్ స్థానంలో పవన్‌ను కంపెనీ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నది. పనయ్ గతేడాది అమెజాన్‌లో చేరేందుకు మైక్రోసాప్ట్ విండోస్ చీఫ్ పదవి నుంచి వైదొలిగారు. అప్పటి పోస్టు ఖాళీగా ఉంటూ వస్తున్నది. తాజాగా పవన్ దావులూరిని నియమించింది. పవన్ దాదాపు 23 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌లో సేవలందిస్తూ వచ్చారు. మద్రాస్ ఐఐటీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. యూఎస్‌లో యూనివర్సిటీ ఆఫ్ మేరిల్యాండ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసాడు. 2001లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా మైక్రో సాఫ్ట్‌లో చేరారు. 2005 నాటికి సర్ఫేస్ టీమ్‌కి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. 2023 నుంచి విండోస్ ప్లస్ డివైజెస్ టీమ్‌కి కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన కంపెనీలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.