
అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని సులభంగా పొందే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 5 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.44 కోట్లు) గోల్డ్ కార్డులను విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డులు గ్రీన్ కార్డు నివాసంతో సమానమని, విదేశీయులు అమెరికన్ పౌరసత్వాన్ని పొందడానికి ఇది మార్గమని ట్రంప్ ప్రకటించారు.సుమారు 1 కోటి గోల్డ్ కార్డులను విక్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం వల్ల దేశం ఎదుర్కొంటున్న రుణ భారం తొలగిపోతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డులు వస్తాయని ఆయన వివరించారు. ఈబీ-5 వీసా కార్యక్రమం ద్వారా విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును అమెరికాలో పెట్టుబడి పట్డడం ద్వారా ఉద్యోగాలు పొందడంతోపాటు ఉద్యోగలను సృష్టించవచ్చు.అంతేగాక శాశ్వత నివాస హోదాను కూడా పొందవచ్చు. అమెరికన్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే విదేశీ సంపన్నులకు ఈబీ-5 ప్రోగ్రామ్ కింద గ్రీన్ కార్డులను ప్రసాదిస్తారు. కాగా, ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేసి గోల్డ్ కార్డుల విక్రయాన్ని ప్రారంభించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు. మరో రెండు వారాలలో ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్రంప్ తెలిపారు.
