అమెరికాలోని చికాగోలో డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. మూడవ రోజు భారతీయ సంతతికి చెందిన పూజారి రాకేశ్ భట్ వేద పఠనంతో సమావేశాలను ప్రారంభించారు. భిన్నత్వం ఉన్నా, దేశం కోసం ఒక్కటిగా ఉండాలన్న సంస్కృత శ్లోకాన్ని ఆయన వినిపించారు. ఐక్యంగా ఉంటేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని పూజారి రాకేశ్ భట్ తన ప్రవచనంలో తెలిపారు. మనం ఒక్కటిగా ఉండాలని, మన మెదళ్లు ఒకేరకంగా ఆలోచించాలని, మన గుండెలు కూడా ఒకేలా కొట్టుకోవాలని, ఇది సమాజ హితం కోసం జరగాలని, దేశాన్ని గర్వంగా నిలుపాలని పూజారి రాకేశ్ భట్ కోరుకున్నారు.
అయితే డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్‌లో పూజారి రాకేశ్ భట్ శ్లోకాలు ప్రత్యేకంగా నిలిచాయి. మేరీల్యాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో ఆయన పూజలు చేస్తుంటారు. మద్వాచారి అయిన ఆయనది బెంగుళూరు. రుగ్వేదం, తంతశాస్త్రంలో రాకేశ్ భట్ పండితుడు. మనం అంతా వసుదైక కుటుంబం అని, సత్యమే అన్నింటికి ఫౌండే షన్ అని, అదే మనల్ని అవాస్తవం నుంచి వాస్తవం వైపు, చీకటి నుంచి వెలుతురు వైపు, మరణం నుంచి అమరత్వం వైపు తీసుకెళ్లుతుందని భట్ తెలిపారు. పూజారి రాకేశ్ భట్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తులు, సంస్కృత భాషాల్లో నిష్ణాతుడు. సంస్కృతం, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఆయనకు మాస్టర్స్ డిగ్రీ ఉన్నది. ఉడిపిలోని అష్టామఠంలో కొన్నాళ్లు పనిచేశారు. బద్రీనాథ్, సేలంలోని రాఘవేంద్ర స్వామి ఆలయం లో పనిచేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ పార్టీ తరపున ఉపాధ్యక్షుడిగా టిమ్ వాల్జ్ నామినేషన్ స్వీకరించారు.