మాతృత్వం అనేది ఓ మధురానుభూతి. ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది. కానీ కొంత మంది దుర దృష్టవంతులకు ఎన్నేండ్లయినా పిల్లలు కలుగరు. ఇప్పుడొక విచిత్ర విషయం గురించి తెలుసుకుందాం. ఒకే మహిళ ఆర్నెల్ల తేడాతో ఇద్దరికి జన్మనిచ్చింది. వైద్యశాస్త్రంలో అత్యంత అరుదైన ఈ సంగతి ఎలా సాధ్యమైం దో వైద్యులు వివరించారు.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన హెయిర్‌స్టయిలిస్ట్ జెస్సీకా ఆరు నెలల్లో రెండు సార్లు ప్రసవించింది. ఆమె ఇద్దరి సంతానంలో మొదటి సంతానం వయసు ఒక ఏడాది కాగా, రెండో సంతానం వయసు ఆరు నెలలు. వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దీనికి కారణమేంటో కూడా జెస్సికా వెల్లడించింది. దీన్ని వైద్య పరిభాషలో సూపర్ ఫెటేషన్ అంటారని తెలిపింది.
ఒకసారి గర్భం దాల్చిన మహిళ మళ్లీ గర్భవతి కావచ్చని పేర్కొన్నది. జెస్సికా విషయంలో ఇద్దరూ ఒకే గర్భాశయంలో వేర్వేరు సమయాల్లో జన్మించారు. అంటే ఒకే గర్భంలో రెండు పిండాలు ఉండి, ఆ రెండూ వేర్వేరు స్థాయిలో అభివృద్ధి చెంది ఉండొచ్చు. సూపర్ ఫెటల్ పిల్లలు టెక్నికల్‌గా ట్విన్స్ అనే చెప్పాలి. కానీ వారు పుట్టిన సమయాల్లో నెలల వ్యత్యాసం ఉంటుంది. ఇలా జరగటం చాలా అరుదు. ఇప్పటి వరకు అలాంటి కేసులు ఓ పది మాత్రమే రికార్డయ్యాయి. జెస్సికా కేసు 11వది.