నారా రోహిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం సుందరకాండ . నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ నారా రోహిత్ మొదట్నుంటీ విభిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నాడు. తన సొంతంగా ఈ స్థాయికి చేరుకున్నాడంటే కారణం అదే అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ చాలా సినిమాలు చేశా. సినిమా పూర్తయిన ప్రతిసారీ ఇంకో ఏదో చేయాలనే అభిప్రాయం కలిగేది. కానీ సుందరకాండ విషయంలో మాత్రం పూర్తి సంతృప్తితో ఉన్నా అన్నారు. అందరూ వినాయక చవితిని చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ సినిమాని చూడండి. కచ్చితంగా ఆస్వాదిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజుతో పాటు నారా రోహిత్ కాబోయే భార్య సిరి పాల్గొన్నారు.















