దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే అభిశంసనను ఎదుర్కొంటున్న ఆయనకు అక్కడి కోర్టు షాక్ ఇచ్చింది. దేశంలో మార్షల్ లా విధించిన కేసులో అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేసింది. యోల్‌ను అదుపులోకి తీసుకుని, ఆయన కార్యాలయంలో సోదాలు చేసేందుకు న్యాయస్థానం అనుమతిచ్చిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 3న దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు యోల్ ప్రకటించడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడిని పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం విచారిస్తున్నది. కాగా, ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ యోల్ విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో పోలీసుల విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉన్నది.