పుష్ప సిరీస్ చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. దాంతో ఆయన తాజా సినిమాతో పాటు భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతున్నది. తాజాగా బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వార్త జాతీయ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సూపర్‌హీరో మూవీ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం.

మలయాళ సూపర్‌హీరో చిత్రం మిన్నాల్ మురళీ తో బాసిల్ జోసెఫ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చిందని, సూత్రప్రాయంగా సినిమాకు అంగీకరించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆధునిక హంగులతో తెరకెక్కించనున్న శక్తిమాన్ కథాంశమిదని టాక్. ఓ ఇంటర్నేషనల్ స్టూడియోతో కలిసి గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నదని చెబుతున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
