జనాభా సంఖ్య తగ్గిపోతుండటంపై తీవ్ర ఆందోళనలో ఉన్న జపాన్‌లోని ఒక గ్రామం వారు పిల్లలు లేని లోటు ను తీర్చుకునేందుకు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. 60 మంది కన్నా తక్కువ జనాభా ఉన్న ఇచ్చినినో అనే కుగ్రామంలో ఒక బిడ్డ మాత్రమే ఉంది. మిగిలిన వారంతా పెద్దవారే. దాంతో పిల్లలు లేని లోటును కన్పించకుండా చేయడానికి వారు పిల్లల సైజులో బొమ్మలను తయారు చేయించి గ్రామంలోని వివిధ ప్రదేశా లలో ఉంచారు. ఆ గ్రామంలోకి అడుగుపెట్టగానే సైకిల్ తొక్కుతున్నట్టు, ఊయల ఊగుతున్నట్టు, తోటి పిల్లల తో ఆటలాడుకుంటున్నట్టు వివిధ రూపాలలో పిల్లల బొమ్మలు దర్శనమిస్తాయి. ఈ బొమ్మలే మా పిల్లలు అంటూ 88 ఏండ్ల వృద్ధుడొకరు పేర్కొన్నారు. ఇదివరకు తమ కుమారులు, కుమార్తెల సంతానంతో గ్రామం కళకళలాడేదని, కానీ చాలామంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో పిల్లల సందడి కరవైందని, దాంతో బొమ్మలనే వారిలా తయారు చేసి ఆ లోటును తీర్చుకుంటున్నట్టు మరో గ్రామస్తుడు తెలిపారు.