అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన హత్యాయత్నం సంచలనం రేపింది. ఇంతకు ముందు కూడా అమెరికాలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ప్రధాన పార్టీల అభ్యర్థులే లక్ష్యంగా పలుమార్లు హింసాత్మక దాడులు జరిగాయి. దాడుల కారణంగా ఏకంగా నలుగురు అధ్యక్షులు మరణించగా, హత్యాయత్నాలతో పలువురు గాయపడ్డారు.
హత్యకు గురైన అమెరికా మొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్. 1865, ఏప్రిల్ 14న ఆయన తన భార్యతో కలిసి వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన సమయంలో జాన్ వైక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. తలలో బలమైన గాయంతో లింకన్ తర్వాతి రోజున మరణించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే అధ్యక్షుడు జేమ్స్ గార్‌ఫీల్డ్ హత్యకు గురయ్యారు. 1881, జూలై 2న న్యూ ఇంగ్లండ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆయనపై చార్లెస్ గిటౌ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. తర్వాత కొద్ది వారాలకు గార్‌ఫీల్డ్ మరణించారు. సెప్టెంబర్ 6న న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ప్రసంగించిన తర్వాత అధ్యక్షుడు విలియం మెకెన్లీపై కాల్పుల ఘటన చోటుచేసుకొన్నది. ప్రజలకు షేక్‌హ్యాండ్ ఇస్తున్న క్రమంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో మెకెన్లీ ఛాతిపై లియోన్ అనే 28 ఏండ్ల నిరుద్యోగి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. మెకెన్లీ వారం తర్వాత మరణించారు. డల్లాస్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. దుండగుడి కాల్పుల్లో తీవ్ర గాయాలైన కెనడీని పార్క్‌ల్యాండ్ దవాఖానకు తరలించారు. ఆ తర్వాత ఆయన మరణించారు.
1933లో ఫ్రాంక్లిన్ రూస్‌వెల్ట్‌పై(32వ అధ్యక్షుడు), 1950లో హర్రీ ఎస్ తుర్మాన్ (33వ అధ్యక్షుడు), 1975లో జెరాల్డ్ ఫోర్డ్‌పై (38వ అధ్యక్షుడు), 1981లో రొనాల్డ్ రీగన్(40వ అధ్యక్షుడు), 2005లో జార్జి డబ్ల్యూ బుష్(43వ అధ్యక్షుడు) పై హత్యాయత్నాలు జరిగాయి. పలువురు అధ్యక్ష అభ్యర్థులపై కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.