రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌పై బహుపాక్షిక భద్రతపై సమావేశంలో పాల్గొనేందుకు దోవల్ మాస్కోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన భేటీలో అజిత్ దోవల్ ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ – రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం అమలు చేసే దిశగా పనులు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొంది. భద్రతా మండలి సమావేశంలో దోవల్ మాట్లాడుతూ కాబూల్‌లో సమ్మిళిత, ప్రాతినిధ్య వ్యవస్థతోనే ఆఫ్ఘన్ సమాజానికి ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని ఆయన పేర్కొన్నారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, దాయెష్ వంటి ఉగ్రవాద సంస్థలను ఎదుర్కొనేందుకు సభ్య దేశాల మధ్య కఠిన నిఘా, భద్రతా సహకారం అవసమన్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్లిష్ట దశను ఎదుర్కొంటోందని, భారతదేశం ఆఫ్ఘన్ ప్రజలను వారి అవసరమైన సమయంలో సహకారం అందిస్తుందన్నారు.
