వీసాల జారీని మరింత సులభతరం చేసేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2004లో ముగిసిన వీసా విధానాన్ని మళ్లీ పునరుద్ధరించే యోచనలో ఉంది. హెచ్-1బీ వీసాదారులకు మేలు చేకూరుస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ విధానం కింద 2004 వరకూ హెచ్-1బీ సహా కొన్ని రకాల వలసేతర వీసాల రెన్యూవల్ లేదా స్టాంపింగ్‌ను అమెరికాలోనే నిర్వహించేవారు. ఆ తరువాత నుంచీ హెచ్-1బీ వీసాదారులు తమ వీసా రెన్యూవల్ పాస్‌పోర్టులపై స్టాంపింగ్ కోసం స్వదేశాల్లోని అమెరికా కాన్సూలేట్లకు వెళ్లాల్సి వస్తోంది. నాటి వీసా విధానాన్ని ప్రయోగాత్మకంగా మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రస్తుతం అమెరికా సిద్ధమవుతోంది. దశల వారీగా వచ్చే రెండు మూడేళ్లలో దీన్ని మరింత విస్త్రత పరచనుందని సమాచారం. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఈ విధానాన్ని పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా దీన్ని మొదలెట్టొచ్చు. ఈ విధానంలో తొలి దశలో ఎంత మంది లబ్ధిపొందుతారని ఇప్పుడే చెప్పలేం. ఈ విధానం మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తే, వీసా రెన్యూవల్ కోసం సొంతదేశాలను వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది అని ఆయన పేర్కొన్నారు.