భారత్-పాక్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని పేర్కొంది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఉన్నత స్థాయి చర్చలో అమెరికా రాయబారి డోరతీ షియా ఈ మేరకు వ్యాఖ్యానించారు. గత మూడు నెలల్లో ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు మధ్యవర్తిత్వం వహించడం, శాంతియుత పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంలో అమెరికా నిబద్ధతతో ఉంది. ఇటీవలే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక పాత్ర పోషించింది అని యూఎన్ భద్రతా మండలి బహిరంగ చర్చలో వ్యాఖ్యానించారు.

అమెరికా వాదనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అనేది కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమేనని స్పష్టం చేశారు. పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ వివాదంలో ఎవరి ప్రమేయం లేదని, ఇదే విషయాన్ని అమెరికాకు కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లు భారత రాయబారి గుర్తు చేశారు.
















