అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్ధులు గత నెల 27న జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న తీరుతో అసంతృప్తిగా వున్న మెజారిటీ ప్రజలకు దేశంలోని ఈ రెండు పార్టీల వ్యవస్థ పట్ల విముఖత పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అధ్యక్షుడు బైడెన్ మానసిక ఆరోగ్యంపై అనేక వదంతులు, వార్తలు ప్రచారంలో వున్నాయి. తాజాగా చర్చలో పాల్గొన్న తీరు, ఆ తర్వాత బైడెన్ చెప్పిన కారణాలతో డెమోక్రటిక్ నేతలు, దాతల్లోనే భయాందోళనలు నెలకొన్నాయి. బైడెన్ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని, దేశాన్ని ఆయన పాలించే పరిస్థితిలో లేరని వెల్లడవుతోంది.

మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్చల్లో బలంగా వ్యవహరించారని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బైడెన్‌ను తప్పించాల్సిందేనని డెమోక్రటిక్ ఓటర్లు బలంగా కోరుకుంటున్నారు. ఈ వారం నిర్వహించిన పోల్ ప్రకారం, ప్రతి ముగ్గురు డెమోక్రటిక్ ఓటర్లలో ఒకరు బైడెన్‌ను అధ్యక్ష ఎన్నికల పోటీ నుండి తప్పించాలని భావిస్తున్నారు. బైడెన్ నామినీగా లేకపోతే ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలిచే అవకాశాలు వున్నాయని 75శాతంమంది ఓటర్లు అభిప్రాయపడుతున్నారని జులై 2న సిఎన్‌ఎన్ నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది. బైడెన్ కన్నా ట్రంప్ బెటర్ అని చాలామంది స్పష్టం చేస్తున్నారు.
