
పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ పర్యటన వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతూ అక్కడి సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది. బీఎల్‌ఏని 2019లోనే స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్‌డీజీటీ) జాబితాలో చేర్చిన అమెరికా, తాజాగా మజీద్ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. ఇటీవలే కాలంలో బీఎల్‌ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్‌లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది.
















