పెహల్‌గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు అగ్రరాజ్యం అమెరికా కీలక సూచన చేసింది. ఉద్రిక్తలను తగ్గించుకోవాలని సూచించింది.ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం ఉంటుందని జైశంకర్‌కు రుబియో హామీఇచ్చారు.

అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకొని, దక్షిణాసియాలో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. పాక్ ప్రధానితో మాట్లాడిన రుబియో, పెహల్‌గామ్ ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్‌తో ప్రత్యక్ష చర్చలు జరపాలని సూచించారు.
