అమెరికాలో పోలీసులు మరోసారి దాష్టీకానికి పాల్పడ్డారు. 2020లో చోటుచేసుకొన్న జార్జి ఫ్లాయిడ్ తరహాలోనే తాజాగా మరో దురాగతానికి ఒడిగట్టారు. ఫ్రాంక్ టైసన్(53) అనే ఓ నల్లజాతీయుడిని కింద పడేసి, మెడపై మోకా లితో గట్టిగా నొక్కిపెట్టి, ఊపిరాడకుండా చేసి అతని ప్రాణాలు తీశారు. నాకు ఊపిరి ఆడటం లేదు అని బాధి తుడు మొత్తుకున్నా పోలీసులు వదిలిపెట్టకుండా కర్కశంగా వ్యవహరించారు. ఓహియో రాష్ట్రంలోని కాంటన్ నగరంలో వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన కు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజ్‌ను కాంటన్ పోలీసు విభాగం విడుదల చేసింది. టైసన్ పట్ల దారుణం గా వ్యవహరించిన పోలీసు అధికారులను బ్యూ స్కోనెగ్జ్, కామ్డెన్ బుర్చ్‌గా గుర్తించారు.
ఈ నెల 18న ఓ కారు ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టిన ఘటన జరిగింది. ఆ సమయంలో కారులో ఉన్న టైసన్‌ను సమీపం లోని ఓ బార్‌లోకి వెళ్లినట్లు పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు అనుమానించి అక్కడికి వెళ్లారు. వీడియో ఫుటేజ్ ప్రకారం టైసన్‌ను పట్టుకొన్న పోలీసులు అతని చేతులకు సంకెళ్లు వేసి, కింద పడేశారు. పోలీసు అధికారుల్లో ఒకరు టైసన్ మెడ సమీపంలోని వెనుక భాగంలో మోకాలు వేసి గట్టిగా నొక్కి పెట్టి ఇప్పుడు బాగుం దా అంటూ వికృత ఆనందం పొందారు. ఆ తర్వాత కొంత సేపటికి టైసన్ చలనం లేకుండా పడిపోయాడు. దీంతో దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.