అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాన్ని ఎదుర్కొంది. న్యూ హాంప్‌షైర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమెను తన ఎదురుగా ఉన్న గుంపులోంచి ట్రంప్ మద్దతుదారు ఒకడు ఊహించని ప్రశ్న అడిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని బిగ్గరగా అరిచాడు.
దాంతో ఆ సమావేశంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న నిక్కీ హేలీ కాస్త తేరుకుని నవ్వుతూ స్పందించారు. నాకు మద్దతుగా ఓటు వేస్తావా? అని అతడిని ప్రశ్నించారు. దాంతో కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్న అతను నేను ట్రంప్‌కు మద్దతుగా ఓటు వేయబోతున్నా అని చెప్పాడు. అతడి సమాధానంతో అసహనానికి గురైన నిక్కీ హేలీ అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని గట్టిగా, ఘాటుగా చెప్పారు. దాంతో మీటింగ్ హాల్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.