Namaste NRI

అమెరికా మరో నిర్ణయం.. వేల మంది భారతీయులపై ప్రభావం

 విదేశీ ఉద్యోగుల పట్ల నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న అమెరికా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. వలస వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే వర్క్‌ పర్మిట్లను ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ చేసే విధానాన్ని రద్దు చేసింది. ఇది వెంటనే అమలులోకి వచ్చింది. దీంతో అమెరికాలో వేల సంఖ్యలో పనిచేస్తున్న భారతీయులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో భారతీయుల సంఖ్యనే అత్యధికం. అక్టోబర్‌ 30 లేదా ఆ తరువాత నుంచి వర్క్‌ పర్మిట్లను పునరుద్ధరించుకోవాలనుకొనే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్‌ రెన్యువల్‌ ఉండదు. ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు అని అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.

భద్రత, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలిపింది. అమెరికాలో పనిచేయడం ఒక అవకాశం అని, అది హక్కు కాదని అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) అధిపతి జోసెఫ్‌ ఎడ్లో వ్యాఖ్యానించారు. గత బైడెన్‌ ప్రభుత్వంలో వలసదారులు తమ వర్క్‌ పర్మిట్‌ కాల పరిమితి ముగిసిన తరువాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో పనిచేసేందుకు అవకాశం ఉండేది. ట్రంప్‌ సర్కారు ఈ విధానానికి స్వస్తి పలికింది. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ-వర్క్‌ పర్మిట్‌) రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం అని తెలిపింది. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున వర్క్‌ పర్మిట్‌ గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్‌ దరఖాస్తు చేసుకోవడం మంచిది అని సూచించింది.

Social Share Spread Message

Latest News