అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించింది. కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఇండ్లలోని కిటికీలను మూసివేసేలా యజమానులను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పింది. మహిళలు సంచరించే వంట గది, పెరడు, బావి, ఇతర ప్రదేశాలు పొరుగింట్లో నుంచి కనిపించకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. విదేశీ ఎన్జీవోల్లో మహిళల నియామకాలను నిషేధించినట్లు అఫ్గానిస్థాన్ ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.