Namaste NRI

శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌ జనరల్‌గా మరో తెలుగు వ్యక్తి

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్‌ జనరల్‌గా మరో తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. భారత్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్‌ శ్రీకర్‌ కె రెడ్డి (ఐఎఫ్‌ఎస్‌) నూతన కాన్సులేట్‌ జనరల్‌ ( సీజీఐ)గా నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ, కామర్స్‌, స్థానిక ఎన్నారైల సమస్యలపై దృష్టిసారిస్తామన్నారు. ప్రవాస భారతీయులందరితో సత్సంబంధాలు నెరివేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రవాస భారతీయులతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్‌ శ్రీకర్‌  కె రెడ్డి 1996లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఆయన ఢల్లీిలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోనూ సేవలందించారు.   భారత దేశ భద్రతకు అత్యంత కీలకమైన పాకిస్తాన్ డెస్క్ ఇంచార్జ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పని చేసిన డాక్టర్ టీ నాగేంద్ర ప్రసాద్ తర్వాత, మరో తెలుగు వ్యక్తి ఆ పదవిని చేపట్టడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఇలా, వరుసగా రెండు సార్లు ఈ పదవిని తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు చేపట్టడం అరుదైన రికార్డు. నూతన కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా ఎంపికైన శ్రీకర్‌కు ప్రవాస భారతీయులు శుభాకాంక్షలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events