తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయని వాణీజయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్య గాయకురాలు. వాణీజయరామ్ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆమె సుమారు వేయి సినిమాలలో 20,000 పాటలకు నేపధ్యగానం చేశారు. అంతే కాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడారు. వాణీ జయరాంకు ఇటీవలే కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వాణీజయరాం భారతదేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఉత్తమ నేపథ్య గాయని విభాగంలో మూడుసార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నారు. అంతేగాక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాలు కూడా ఆమెను అవార్డులతో సత్కరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా వాణీ జయరాంకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. వాణీ జయరాంకు ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఐదో సంతానమై ఆమె 1971లో గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు.














