
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతున్నది. నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ క్రమంలో బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై ట్రంప్‌ను ఉద్దేశించి మస్క్ నేరుగానే విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ పేర్కొన్న కొద్ది సేపటికే మస్క్ ఈ తీవ్ర ఆరోపణ చేయడం గమనార్హం.
