అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ డీప్ ఫేక్ కాల్స్ కలకలం రేపాయి. ఈ ఎన్నికల్లో ఓటెయ్యొద్దు అంటూ జో బైడెన్ వాయిస్‌తో ఓటర్లకు డీప్ ఫేక్ కాల్స్ వెళ్లాయి. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్ కు చెందిన అభ్యంతరకర దృశ్యాలపై కూడా వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నా మన్నారు. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తామని చెప్పారు. ఈ డీప్ ఫేక్ కాల్స్‌ను కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.
ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం ప్రైమరీ పోల్స్ కొనసాగుతు న్నాయి. ఈ క్రమంలోనే గత వారం న్యూహాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎన్నికలు చేపట్టారు. ఈ సందర్భం గా అక్కడి ఓటర్లకు జో బైడన్ చెప్పినట్టుగా ముందుగా రికార్డు చేసిన కొన్ని నకిలీ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ ఎన్నికలో ఓటు వేయొద్దంటూ, ఆయన ఓటర్లను కోరినట్లు వాటి సారాంశం. ఈ ఏఐ జనరేటెడ్ కాల్స్‌పై ఇప్పటికే అధికారులు చర్యలు ప్రారంభించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఈ కొత్త సాంకేతికత అభ్యర్థులను కలవరపెడుతోంది.