విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా (ఎస్‌ఐవీ)గా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వెస్టర్లు ఆ దేశంలో నివసించే వెసులుబాటు ఉంది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో దీనిని రద్దు చేస్తున్నట్టు ఆ దేశ హోం శాఖ మంత్రి క్లేర్ ఓ నీల్ ప్రకటించారు. దాని స్థానంలో వృతి నిపుణులకు ఇచ్చే వీసాల సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపింది. దేశంలో పెట్టుబడులను పెట్టే వారిని ఆకర్షించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసాను 2012లో ప్రవేశపెట్టింది. 5 మిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లు ఆ దేశంలో పెట్టుబడిగా పెడితే వారికి గోల్డెన్ వీసా లభిస్తుంది. అయితే దీని ద్వారా అవినీతి సొమ్ము వస్తున్నదని ఆ దేశంలో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ విమర్శలకు తోడు దాని నుంచి ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాకపోవడంతో దానిని రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని ప్రభావం భారతీయులపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
