తెలంగాణ జానపద కళాకారుడు బలగం ఫేం మొగిలయ్య(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను వరంగల్ సంరక్ష ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మొగిలయ్య తుదిశ్వాస విడిచారు. తెలంగాణ నేపథ్య కథాంశంతో వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన బలగం సినిమా మొగిలయ్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ైక్లెమాక్స్‌లో మొగిలయ్య నటిస్తూ పాడిన తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచీ.. నువ్వెట్టా ఎల్లీనావూ కొమరయ్యా నీ జ్ఞపకాలు మరువమయ్యో కొమరయ్యా పాట ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది.
మొగిలయ్య మరణంతో ఆయన స్వగ్రామమైన దుగ్గొండిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మొగిలయ్య మృతి పట్ల నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వేణు సంతాపం వెలిబుచ్చారు. తెలంగాణ సంస్కృతినీ, మూలాలను తన గానంతో భావితరాలకు తెలియజెప్పిన గొప్ప కళాకారుడు మొగిలయ్య అని వారు కొనియాడారు. మొగిలయ్య చికిత్స కోసం అగ్రనటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థిక సాయం కూడా చేశారు. కానీ ఆయన ప్రాణాలు మాత్రం దక్కలేదు.