ప్రియదర్శి హీరో గా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించిన సినిమా బలగం. ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సిరిసిల్ల లోని బతుకమ్మ ఘాట్ లో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అథితిగా రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాకారం అయిన తర్వాత జొన్నలగడ్డ సిద్ధు, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి వంటి హీరోలందరూ సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. మన యాస, భాష మాట్లాడటానికి మొహమాట పడ్డ రోజుల నుంచి నేడు టీవీలు మొదలుకొని వెండితెర వరకు తెలంగాణ యాస వినిపిస్తుందంటే అందుకు ఒకే ఒక్క కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు . సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ డబ్బు కంటే మించింది మన సంస్కృతి. అది ఈ సినిమాలో చూపించారు. కేటీఆర్ గారు తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. రామన్న కూలెస్ట్ పొలిటీషియన్. తెలంగాణ కల్చర్ ఎంత గొప్పదో ఈ సినిమాతో అర్థమైంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు సిరిసిల్లలో నిల్చున్నట్లుంది అని అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు కేటీఆర్ అన్నకు కృతజ్ఞతలు. తెలంగాణ పల్లె జీవితాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఇలాంటి కథలు నటీనటులకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్స్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.