రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో సీక్వెల్‌గా రాబోతున్న జైలర్-2పై భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఇందులో ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్రబృందం బాలకృష్ణను సంప్రదించిదట. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. తొలిభాగం జైలర్ లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి అగ్ర నటులు కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించారు.

ఇప్పుడు సీక్వెల్‌లో బాలకృష్ణ అదే తరహా పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా ఆయన బాలకృష్ణ కోసం ఓ పవర్‌ఫుల్ పాత్రను క్రియేట్ చేశారని అంటున్నారు. కేవలం అతిథి పాత్ర తరహాలో కాకుండా కథాగమనంలో కీలకంగా ఉంటూ పది నిమిషాల నిడివితో బాలకృష్ణ పాత్రను డిజైన్ చేశారని తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇదేగనుక నిజమైతే రజనీకాంత్-బాలకృష్ణ కాంబోతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
