పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల వేళ పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియను ప్రభావితం చేయడంతో పాటు, ప్రత్యర్థి వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి పన్నిన భారీ కుట్రను పోలీసులు సకాలంలో ఛేదించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ, స్థానిక టీడీపీ నేత పావులూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గుంటూరు నుంచి సుమారు 100 మందిని 22 కార్లలో తిమ్మాపురం గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.

గ్రామానికి చేరుకున్న ఆ బృందానికి స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో మద్యం, విందు భోజనాలు ఏర్పాటు చేసి, అనంతరం మారణాయుధాలు, కర్రలతో దాడులకు సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ వ్యవహారంపై ముందే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వాహనశ్రేణిని అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి 22 కార్లు, 4 వేటకొడవళ్లు, 60 కర్రలను స్వాధీనం చేసుకుని, ఘటనతో సంబంధం ఉన్న 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు.

గ్రామంలోని టీడీపీలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగానే ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని నరసరావుపేట ఏఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించిన నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనలో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.















