అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ డెమోక్రాట్లు మెజారిటీ సాధించడం వల్లే దేశంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని, ఇరాన్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఆయన ఆరోపించారు. డెమోక్రాట్లు విజయం సాధిస్తే ఆర్థిక మార్కెట్లు పతనమవుతాయని, ఇరాన్ మరింత రెచ్చిపోతుందని తాను ముందే అంచనా వేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 81 వేల మంది నిరసనకారులను ఇరాన్ పొట్టనబెట్టుకుందని, ఇప్పుడు డెమోక్రాట్ల గెలుపు ఆ దేశానికి మరింత బలాన్నిచ్చిందని విమర్శించారు.

గత వారం రోజుల్లో ఇరాన్ మునుపెన్నడూ లేని స్థాయిలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, అయితే అమెరికా రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుని కూల్చివేశాయని తెలిపారు. ఈ దాడుల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ఎన్నికలకు ముందు ముడి చమురు (ఆయిల్) ధరలను గరిష్ట స్థాయిలో ఉంచేందుకు డెమోక్రాట్లు, ఇరాన్ కుమ్మక్కయ్యాయని ట్రంప్ ఆరోపించారు. డెమోక్రాట్లు బలహీనమైన వారని, వారు దేశాన్ని నాశనం చేస్తారని ఇరాన్ నాయకత్వం భావిస్తోందని, కానీ తాను అలా జరగనివ్వనని స్పష్టం చేశారు. ఓటర్లు ఎన్నికలకు ముందే ఈ కుట్రను గ్రహించలేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఆయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టడం వెనుక పెద్ద మోసం దాగి ఉందని ఆయన ప్రశ్నించారు.















