ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని టీఆర్‌ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిజంగానే తప్పుచేసుంటే కేంద్రం ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలతో విచారణ చేయవచ్చని తెలిపారు. వ్యక్తిగత కక్షతో నిందలు వేయడం అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని చెప్పారు. దర్యాప్తు సంస్థల కన్నా ముందే అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలకు లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సమాచారం ఎలా అందిందని ప్రశ్నించారు. బీజేపీకి కేసీఆర్ భయం పట్టుకుందని విమర్శించారు. కవిత నివాసంపై బీజేపీ కార్యకర్తలు దాడిచేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే టీఆర్‌ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పిట్ట బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీల పట్ల కక్ష పూరిత విధానాలు అవలంభిస్తూ, ఆయా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నదని ఆరోపించారు.














