ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్సియల్ సేవల సంస్థ అమెరికా ఎక్స్‌ప్రెస్‌కు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) బిగ్ రిలీఫ్‌నిచ్చింది. 15 నెలల తర్వాత కొత్తగా క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అమెరికా ఎక్స్‌ప్రెస్‌పై విధించిన నిషేధం ఎత్తేస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్‌లో డైనర్స్ క్లబ్, గత నెలలో మాస్టర్ కార్డ్‌పై విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్టర్ కార్డ్, వీసా, అమెరికా ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ వంటి ఫైనాన్సియల్ సంస్థలు భారత్‌లో క్రెడిట్ కార్డులు తీసుకునే ఖాతాదారుల డేటాను 2018 అక్టోబర్ నుంచి స్థానికంగానే నిల్వ చేయాల్సి ఉంది. కానీ, అలా చేయడంలో మాస్టర్ కార్డ్, అమెరికా ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ విఫలం కావడంతో వాటిపై నిషేధం విధించింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా ఎక్స్‌ప్రెస్ సీవోవో, కంట్రీ తాత్కాలిక మేనేజర్ సంజయ్ కన్నా తెలిపారు. క్రెడిట్ కార్డు ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని స్థానికంగా భద్రపర్చాలన్న నిబంధనను పాటించకపోవడంతో గతేడాది మే నుంచి కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా అమెరికా ఎక్స్‌ప్రెస్‌పై నిషేధం విధించింది.














