Namaste NRI

బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక విషయాలు వెలుగులోకి!

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(ఏఏఐబీ), గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) అధికారులకు బ్లాక్‌బాక్స్‌, డిజిటల్‌ వీడియో రికార్డర్స్‌ లభ్యమయ్యాయి. ఈ మేరకు పౌరవిమానయానశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాద స్థలంలో రెసిడెంట్‌ డాక్టర్స్‌ హాస్టల్‌ భవనం పైకప్పు మీద విమాన శకలాలలో బ్లాక్‌బాక్స్‌ దొరికిందని పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో బ్లాక్‌బాక్స్‌ కీలకం కానుంది. సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్‌బాక్స్‌ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు.

ఇందులో విమానానికి సంబంధించిన ఫ్లైట్‌ డాటా రికార్డర్‌(ఎఫ్డ్‌ఆర్‌) వంటి సాంకేతిక సమాచారం, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌(సీవీఆర్‌) సంభాషణల సారాంశం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో విమానంలోని ఇద్దరు పైలట్‌ల మాటలు రికార్డవుతాయి. ప్రమాదానికి ముందు వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలిస్తే దర్యాప్తు సులభమవుతుంది. బ్లాక్‌బాక్స్‌ పక్కనే డీవీఆర్‌లు ఉంటాయి. విమానంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయిన దృశ్యాలు ఇందులో ఉంటాయి. బ్లాక్‌బాక్స్‌, డీవీఆర్‌లోని డాటాని ఫోరెన్సిక్‌ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి. గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన 40 మంది అధికారులు దర్యాప్తులో భాగస్వాములవుతు న్నారని పౌరవిమానయానశాఖ తెలిపింది. విమానం 29 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరడం, గాల్లోకి ఎగరడానికి మొత్తం రన్‌వేను ఉపయోగించుకోవాల్సి రావడం వంటి అంశాలు విమాన పనితీరుపై సందేహాలు కలిగిస్తున్నదని అంటున్నారు.

Social Share Spread Message

Latest News