ఇండియా, పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని డ్రాగన్ దేశం చైనా కోరింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరో వైపు కొన్ని రోజుల నుంచి నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల బలగాలు ఫైరింగ్‌కు పాల్పడితున్నాయి. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి గువో జాయికున్ మీడియాతో మాట్లాడుతూ ఈ అభ్యర్థన చేశారు.

ఇరు దేశాలు సంయమనం పాటిస్తాయని ఆశిస్తున్నామని, ఒకర్ని ఒకరు కలుసుకుని, చర్చల ద్వారా విబేధాలను పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ స్థిరత్వాన్ని, శాంతిని నెలకొల్పాలని భావిస్తున్నట్లు జాయికున్ తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల్ని చల్లార్చే ఎటువంటి చర్యనైనా స్వాగతిస్తామని చైనా పేర్కొన్నది. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొత్త ఉద్రిక్తతలకు దారి తీశాయి. నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ ఇండో, పాక్ బోర్డర్ వద్ద కాల్పులు ఘటనలు జరిగాయి.
