బ్రిటన్‌లో విద్యనభ్యసించాలనుకొనే విద్యార్థులకు చేదువార్త. బ్రిటన్ ప్రభుత్వం విద్యార్థి వీసాల ఫీజులను భారీగా పెంచింది. ఆరునెలల లోపు గడువుతో ఆ దేశంలో పర్యటించాలనుకొనేవారి వీసాల చార్జీలను కూడా పెంచింది. ముఖ్యంగా విద్యార్థి వీసాల చార్జీలను 490 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు (జీబీపీ) పెంచింది. పర్యాటక వీసాలపై 115 జీబీపీలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు నేటి నుంచే అమల్లోకి రానున్నది. వీసా ఫీజుల పెంపును బ్రిటన్ హోంశాఖ సమర్థించుకొన్నది. దేశంలో ప్రజా పనులకు అధిక నిధులు కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్యసేవకు (నేషనల్ హెల్త్ సర్వీస్) వారు చెల్లించే సర్‌ఛార్జీని పెంచారు. దేశంలోప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు.
